అమరావతి: జైభీమ్ సినిమా సమాజానికి చాలా చక్కని సందేశమని సీపీఐ నేత నారాయణ అన్నారు. సమాజంలో నిత్యం జరిగే దుర్మార్గాలలో ఒక అంశాన్ని చాలా బలంగా అందరి కండ్లకు కట్టినట్టు చూపించిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఆ సినిమా చూసినంత సేపు తనకు ఓ సినిమా చూస్తున్నట్టు అనిపించలేదని చెప్పారు. అశ్లీలత, అనవసర ఫైటింగులు లేకుండా అద్భుతంగా ఉందన్నారు.
నేటి సమాజం, ప్రత్యేకంగా యువ న్యాయవాద సమాజం ఆదర్శంగా తీసుకోవాల్సిన బాధ్యతను, సందేశాత్మక సంకేతాలనే జై భీమ్ సినిమా సమాజానికి పంపిందని నారాయణ పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాల్లోనే ఉంటున్న తనకు ఈ సినిమాలోని ఒక సన్నివేశానికి అవినాభావ సంబంధం ఉందని చెప్పారు. 37 ఏండ్ల కిందటి ఘటన కళ్ళముందు కదలాడిందన్నారు. సినతల్లి పెట్టిన కేసును ఎలాగైనా ఉపసంహరింపజేయడం కోసం పోలీసు బాస్.. చనిపోయిన నీ భర్త ఎటూ రాడు, కనీసం పరిహారమైనా అందుకొని కేసు ఉపసంహరించుకో అంటాడని, ఆ సందర్భంలో సినతల్లి ఇచ్చిన సమాధానం వ్యవస్థలకు దిమ్మతిరిగేలా ఉందని నారాయణ పేర్కొన్నారు.