(Jagan met Modi) న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ భేటీ అయ్యారు. మూడు రాజధానుల అంశం, అమరావతి అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక, బహుళార్థక పోలవరం ప్రాజెక్టుపై మోదీతో జగన్ చర్చించినట్లు తెలుస్తున్నది. వీరి భేటీ దాదాపు గంట సేపు కొనసాగినట్లు తెలుస్తున్నది. ఈ సందర్భంగా పలు అంశాలతో కూడిన వినతిపత్రాన్ని మోదీకి జగన్ అందజేశారు. ప్రధానితో సమావేశంలో సీఎం జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, గోరంట్ల మాధవ్, పీవీ మిథున్‌రెడ్డి ఉన్నారు. విభజన సమయంలో తలెత్తిన వివాదాలపై చర్చించేందుకు జనవరి 12న రెండు తెలుగు రాష్ట్రాల సమావేశానికి కేంద్రం పిలుపునిచ్చిన నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నది.
రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై మోదీతో సీఎం జగన్ చర్చించినట్లు తెలుస్తున్నది. పెండింగ్ సమస్యలను ప్రధానికి నివేదించిన జగన్.. విభజన సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. రాష్ట్ర విభజన ఆర్థిక ప్రగతిని దెబ్బతీసిందని గణాంకాలతోపాటు ప్రధానికి వివరించారు. పోలవరం నిర్మాణంపై రూ.2,100 కోట్ల పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని కోరారు. అలాగే రెవెన్యూ లోటును పూడుస్తామని ఇచ్చిన హామీ మేరకు పెండింగ్‌లో ఉన్న రూ.18,830.87 కోట్ల నిధులను వెంటనే చెల్లించాలని జగన్ కోరారు.
మోదీతో భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జగన్ సమావేశమయ్యారు. అలాగే, పౌర విమానయాన మంత్రి సింథియా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీతో రేపు భేటీ కానున్నారు.