అమరావతి : అమెరికా(America) లో జరిగిన కాల్పుల(Firing) ఘటనలో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఓ సూపర్ మార్కెట్లో జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన గోపీకృష్ణ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. తెలుగు యువకుడు మృతిపట్ల వైసీపీ అధినేత , మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గోపికృష్ణ (Gopi Krishna) కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని కోరారు.
ఏపీలోని బాపట్ల(Bapatla) జిల్లా కర్లపాలెం మండలం యాజలికి చెందిన దాసరి గోపీకృష్ణ 8 నెలల క్రితం ఉద్యోగాన్వేషణ కోసం అమెరికా వెళ్లాడు. సౌత్ ఆర్కెన్సాస్లోని ఫోర్డీస్లో ఉంటూ అక్కడే మ్యాచ్ బుచర్ గ్రాసరీ స్టోర్లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం గోపీకృష్ణ కౌంటర్లో ఉండగా ఓ దుండగుడు సూపర్ మార్కెట్లోకి ప్రవేశించాడు. నేరుగా గోపీకృష్ణ దగ్గరకు వెళ్లి అతనిపై కాల్పులు జరిపాడు. బుల్లెట్ తగలడంతో గోపీకృష్ణ కిందపడిపోయాడు.
అనంతరం ఆ దుండగుడు సూపర్ మార్కెట్లో తనకు కావాల్సిన వస్తువు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ గోపీకృష్ణను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. గోపీ మరణవార్త తెలియడంతో అతని స్వగ్రామం యాజలిలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.