అమరావతి : వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) లండన్‌లో పర్యటిస్తున్నారు. రెండు వారాల పర్యటన సందర్భంగా రెండు రోజుల క్రితం విజయవాడ నుంచి బయలు దేరిన జగన్, సతీమణి భారతీతో కలిసి లండన్‌కు చేరుకున్నారు.
కుమార్తె వర్షారెడ్డి ప్రపంచ ప్రతిష్టాత్మక కింగ్స్ కాలేజ్ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ పట్టా (Master Of Science) పుచ్చుకున్న సందర్భంగా లండన్‌కు(London) వెళ్లారు. ఆమెను జగన్ ఎక్స్ ఖాతాలో అభినందిస్తూ పోస్ట్ చేశారు. డిస్టింక్షన్లో ఉత్తీర్ణత సాధించడం మాకు ఎంతో గర్వకారణమయ్యావని వర్షమ్మకు అభినందనలు అంటూ ట్వీట్ (Tweet) చేశారు. ఆ దేవుడి ఆశీస్సులు నీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.
కాగా మాజీ మంత్రి రోజా (Roja) సెల్వమణి కూడా జగన్‌కు కూతురు పట్టా సాధించినందుకు ట్విటర్లో అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సొంతం కావాలని మనసారా కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల్లో నిందితుడిగా ఉండడంతో విదేశాలకు వెళ్లేందుకు ఏసీబీ కోర్టు గతంలో అనుమతించలేదు. పలుమార్లు కోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం దానికి కోర్టు నుంచి అనుమతి రావడంతో జగన్ లండన్‌కు బయలు దేరారు. ఈనెల చివరి వారంలో తిరిగి స్వదేశానికి చేరుకోనున్నారు.