అమరావతి : తెలుగుదేశం పార్టీ రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న మహానాడు ( Mahanadu ) పై మాజీ మంత్రి రోజా ( Roja ) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా మహానాడులో గొప్పలు చెప్పుకుంటున్నారని, అది మహానాడు కాదు.. దగానాడు ( Daganadu ) అని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై జూన్ 4 నుంచి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. తాడేపల్లిలో మీడియాతో ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని ఆరోపించారు. సూపర్ సిక్స్, సూపర్ హిట్ ఎలా అయిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
వైఎస్ జగన్ చేసిన అభివృద్ధిని క్రెడిట్ చోరీ చేస్తున్నారని విమర్శించారు. మహానాడులో వేదికపై స్త్రీ శక్తి పెట్టుకుని టీడీపీ దగానాడు అని పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. 18 ఏండ్లు నిండిన యువతికి ప్రతి నెలా రూ.15 వందలు ఇస్తామన్న బాబు ఇప్పటి వరకు ఒక్క పైసా ఇవ్వలేదని ఆరోపించారు.
అమ్మ ఒడి పథకంలో 20 లక్షల మంది లబ్దిదారుల పేర్లను తొలగించారని అన్నారు. నారా లోకేష్ విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కూటమి నాయకులు నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు వైసీపీ నాయకుడు జగన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు.