అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్ని వ్యవస్థలను మేనేజ్ చేసినా ఏపీలో వైఎస్ జగన్(YS Jagan) మరోసారి ముఖ్యమంత్రి(Chief Minister) గా కావడం ఖాయమని మంత్రి రోజా (Minister Roja) ధీమాను వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు.
ఈనెల 4న జరిగే ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎవరికి వారే ఎగ్జిట్ పోల్స్(Exit polls) లో ఫలితాలు వెల్లడించాయని పేర్కొన్నారు. పోలింగ్ రోజున మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారని, ఇది అధికార వైసీపీ(YCP) కి అనుకూలమని అన్నారు. రాష్ట్రం వీడిపోయి కష్ట, నష్టాల్లో ఉన్నాగాని రాష్ట్రాన్ని చిత్తశుద్ధితో, పారదర్శకంగా అభివృద్ధి చేసినందునే వైఎస్ జగన్కు ప్రజలు పట్టం కట్టనున్నారని పూర్తి విశ్వాసంతో ఉన్నామని తెలిపారు.
2014లో కూటమి అధికారంలోకి వచ్చి ప్రజలకు ఒరగబెట్టిందేమి లేదని గ్రహించిన ప్రజలు ఈ ఎన్నికల్లో కూటమికి ఓటమి తప్పదని అన్నారు. వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్ చేసి ఇష్టానుసారంగా ఎన్నికల అధికారులను మార్చి వేయడం, వైసీపీ నాయకులను అరెస్టు చేయించారని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో మార్పులు చేయించడం ఇదివరకెన్నడూ జరుగ లేదని ఆమె అన్నారు.