అమరావతి : ఏపీలో మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) కుటుంబ సమస్యను టీడీపీకి ఆపాదించడం దారుణమని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ (AP Minister Satyaprasad) ఆరోపించారు. మంగళవారం తిరుమలను(Tirumala) దర్శించుకున్న మంత్రికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం పండితులు ఆలయ మర్యాదల ప్రకారం తీర్థప్రసాదాలు అందించి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
వైసీపీ(YCP) పార్టీ అబద్దాల పునాది మీద పుట్టిందని, ఎప్పుడూ అబద్దాలే ఆడుతుందని విమర్శించారు. ఆస్తి గోడవలను షర్మిల బయటపడితే టీడీపీని విమర్శించడమేంటి ?.. అని ప్రశ్నించారు. అబద్దాలను నిజం చేసేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
వైసీపీ హయాంలో రాష్ట్ర ప్రజానికం అనేక ఇబ్బందులు పడిందని, ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandra babu) 130 కార్యక్రమాలు అమలు చేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్ర భవిష్యత్ కోసం మంచి ప్రణాళికతో ముందుకు వెళుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమాలు విజయవంతం కావాలని వేంకటేశ్వరస్వామిని కోరినట్లు వివరించారు.