అమరావతి : ఏరు దాటేంత వరకు ఓడ మల్లన్నా.. దాటాక బోడి మల్లన్నలా ఉంది కూటమి ప్రభుత్వ తీరని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila ) ఆరోపించారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో (RTC Bus ) ఫ్రీ..ఫ్రీ అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టి, ఓట్లు వేయించుకొని, ఇప్పుడు కండీషన్ అప్లై అనడం దారుణమని శుక్రవారం ట్విటర్ ( Twitter ) వేదిక ద్వారా పేర్కొన్నారు.
జిల్లా స్థాయి వరకే పథకాన్ని పరిమితం చేస్తామని చెప్పడం మహిళలను మోసం చేయడమేనని ఆరోపించారు. ఈ పథకాన్ని అమలు చేయాలన్న చిత్తశుద్ది లేక సాకులు చెబుతుందని దుయ్యబట్టారు. ఉచిత బస్సు విధానంపై ఆదిలోనే యూటర్న్ తీసుకోవడం అంటే ఇదేనని వెల్లడించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 9 నెలలు దాటినా ఉచిత ప్రయాణం కల్పించకుండా మహిళలను మోసం చేశారని ప్రభుత్వాన్ని నిలదీశారు .
కమిటీల పేరుతో కాలయాపన , రాష్ట్రాల పర్యటన పేరుతో విహార యాత్రలు చేశారని విమర్శించారు. పథకం అమలుకు ముందే ఇన్ని నిబంధనలు పెట్టే ఈ ప్రభుత్వం.. రేపు అమల్లోకి తెచ్చే సరికి నియోజక వర్గం, మండల స్థాయి వరకే ఫ్రీ అంటారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మహిళలకు రాష్ట్రమంతా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తుందని వివరించారు.
పల్లెవెలుగు (Pallevelugu) , ఎక్స్ప్రెస్ (Express Bus) బస్సుల్లో ఎక్కడినుంచి ఎక్కడికైనా అంతా ఉచితమే చేయాలన, ఆధార్ కార్డు చూపిస్తే చాలు ఎంతదూరమైనా జీరో టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంచి పథకాన్ని, అతి తక్కువ ఖర్చుతో మహిళలకు మేలు జరిగే హామీని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వానికి ఇంకా మనసు రావడం లేదని పేర్కొన్నారు.
నెలకు రూ. 350 కోట్లు మహిళల కోసం ఆర్టీసీకి ఇవ్వడానికి ధైర్యం చాలడం లేదని, మహిళలకు భద్రత కల్పించే విషయంలో కూడా లాభనష్టాలు చూడాలా ? ఇదేనా కూటమి ప్రభుత్వం కల్పిస్తున్న మహిళా సాధికారిత ? అంటూ ప్రశ్నించారు. తక్షణం మహిళలకు రాష్ట్రమంతా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.