అమరావతి : విజయవాడ (Vijayawada) ప్రాంతం వరదలతో కొట్టుకుపోతుంటే తాను కనిపించడం లేదని వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) తీవ్రంగా ఖండించారు. వరద ప్రభావ ప్రాంతాలకు తాను వెళ్లి పాల్గొంటే సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందని, అధికారులపై ఒత్తిడి పెరుగుతుందన్న ఉన్నతాధికారుల సూచనలతో తాను వెళ్లలేదని స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
తనను విమర్శించే ముందు రాష్ట్రంలో తలెత్తిన విలయాన్ని ఉమ్మడి సమస్యగా భావించి వైసీపీ నాయకులు (YCP Leaders) ఇంట్లో కూర్చుని ప్రకటనలు ఇచ్చే బదులు సహాయ చర్యల్లో పాల్గొనాలని సూచించారు. సహాయం చేసిన తరువాత బయటకు వచ్చి మాట్లాడాలని, అవసరమైతే తనతో కూడా సహాయ చర్యల్లో పాల్గొంటే తన కాన్వాయ్ వెంట వారిని కూడా తీసుకెళతానని వెల్లడించారు. వరద ప్రభావ ప్రాంతాల్లో హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా రెండురోజులుగా ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు.
భారీ వర్షాలో కృష్ణానది వల్ల విజయవాడకు పెద్దగా ప్రమాదం జరుగలేదని బుడమేరు (Budameru) వాగును దశాబ్దాలుగా 90శాతాన్ని ఆక్రమించుకుని ఇళ్లను, లేఅవుట్లను నిర్మించడంతో విజయవాడ ముంపునకు గురైందని అన్నారు. అయితే వైసీపీ హయాంలో నీటి వనరులకు సరైనా నిధులు కేటాయించక పోవడం ముంపునకు కారణమైందని ఆరోపించారు. విపత్తు సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుభవంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవలందిస్తుటే వైసీపీ నాయకులు విమర్శించడాన్ని పవన్‌కల్యాణ్ తప్పుబట్టారు.