తిరుపతి : టీటీడీ ఈవో జె.శ్యామలరావు(TTD EO Shyamala Rao ) అధికారులతో కలిసి గురువారం నారాయణగిరి షెడ్ల వద్ద వివిధ క్యూ లైన్లను పరిశీలించారు. ఇందులో భాగంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కు వెళ్లే సర్వ దర్శనం, స్లాటెడ్ సర్వ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్లను ఆయన తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించేందుకు ఇంజినీరింగ్, విజిలెన్స్ అధికారులకు పలు సూచనలు చేశారు. నారాయణగిరి షెడ్లలోని క్యూలైన్ల పరిశీలనలో భాగంగా సరైన పారిశుద్ధ్య చర్యలు లేకపోవడంతో సంబంధిత అధికారికి షోకాజ్ నోటీసు (Show cause notice) జారీ చేయాలని ఆదేశించారు.
వర్షప్రభావం సన్నద్ధతపై సమీక్ష..
రాబోయే రోజుల్లో కురిసే వర్షాల వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈవో శ్యామల రావు ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గతంలో భారీ వర్షాలకు బండరాళ్లు కూలి దెబ్బతిన్న ఘాట్ రోడ్ల పునరుద్ధరణ పనులను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు డిజాస్టర్ మేనేజ్మెంట్ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
తిరుపతిలోని కళ్యాణి డ్యాంతో పాటు, తిరుమలలో భక్తులకు ప్రధాన నీటి వనరులైన ఐదు డ్యాముల గురించి వివరించారు. సమీక్షలో జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, సీఈ నాగేశ్వరరావు, ఎస్ఈ2 జగదీశ్వర్‌రెడ్డి, ఈఈలు, అధికారులు పాల్గొన్నారు.