అమరావతి : ఏపీలో అరాచక పాలన కొనసాగుతుందని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సోషల్ మీడియాపై (Social Media) కేసులు పెడుతున్నారని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజిని (Vidadala Rajini) ఆరోపించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా వైసీపీ కార్యకర్తలను జైలుకు పంపుతుందని విమర్శించారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్పై (YS Jagan),ఆయన కుటుంబ సభ్యులపై , తనపై పెట్టిన పోస్టులపై ఆధారాలతో సహా డీజీపీ(DGP) , ఎస్పీకి ఫిర్యాదు చేస్తే టీడీపీ వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. పోలీసులు పూర్తిగా ప్రభుత్వానికి దాసోహం అయ్యారని మండిపడ్డారు.
అక్రమంగా, అన్యాయంగా వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులపై కేసులు పెట్టిన అధికారులపై రానున్న రోజుల్లో చర్యలుంటాయని అన్నారు. వైసీపీకి చెందిన సుధారాణిని ఐదురోజుల పాటు అక్రమంగా, అన్యాయంగా స్టేషన్లో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. సోషల్ మీడియా ప్రతినిధులు ఎవరూ కూడా అధికార పార్టీకి భయపడవద్దని సూచించారు.