PV Sunil Kumar | ఏపీ సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌కు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఆయన సస్పెన్షన్‌ను మరో ఆరు నెలలు పొడిగింది. దీని ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 24వ తేదీ వరకు ఆయన సస్పెన్షన్‌లో ఉండనున్నారు. ఈ మేరకు మంగళవారం నాడు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో రెండు రోజుల్లో సునీల్ కుమార్ సస్పెన్షన్ గడువు ముగియనుండటంతో రివ్యూ కమిటీ సమీక్షించి ఈ నిర్ణయం తీసుకుంది.
అగ్రి గోల్డ్ నిధులు దుర్వినియోగం ఆరోపణలపై సునీల్ కుమార్‌పై ఏసీబీ విచారణ కొనసాగుతోంది. అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధించిన కేసులోనూ గుంటూరు నగరపాలెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ సస్పెన్షన్ ఎత్తివేస్తే ఆయన సాక్ష్యాధారాలు, దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని రివ్యూ కమిటీ అభిప్రాయపడింది. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున మరో ఆరు నెలల పాటు సునీల్‌కుమార్ సస్పెండ్ చేయాలని సూచించింది. రివ్యూ కమిటీ సూచన మేరకు సునీల్ కుమార్ సస్పెన్షన్‌ను మరో ఆరు నెలలు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.