అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలను ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. మే 6వ తేదీ నుంచి ఫస్టియర్, 7వ తేదీ నుంచి సెకండియర్ పరీక్షలు ప్రభుత్వం నిర్వహించింది. 6 మే నుంచి 25 వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షలను ఏపీ ఇంటర్ బోర్డు పటిష్ట ఏర్పాట్లతో పూర్తిచేసింది. స్పాట్ వ్యాల్యుయేషన్ పకడ్బందీగా నిర్వహించామని మంత్రి తెలిపారు. మొత్తం 8లక్షల 69వేల 059 మంది విద్యార్థులు పాల్గొన్నారని వివరించారు.
మొదటి సంవత్సరం విద్యార్థులు 4లక్షల 45వేల 604 మంది, రెండవ సంవత్సరం విద్యార్థులు 4లక్షల 23వేల 458 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని వివరించారు. ఒకేషనల్ కోర్సులో 72వేల 299 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. మొదటి సంవత్సరంలో 2లక్షల 41వేల 591 మంది ఉత్ణీర్ణులయ్యారని వివరించారు. ఉత్తీర్ణత 54శాతం కాగా రెండవ సంవత్సరంలో 2లక్షల 58వేల 449 మంది 61శాతం మంది పాసయ్యారని వివరించారు.
మొదటి సంవత్సరంలో బాలురు 49శాతం మంది , బాలికలు 60శాతంమంది , రెండో సంవత్సరంలో 54శాతం మంది బాలురు, బాలికలు 68శాతం మంది పాసయ్యారని మంత్రి వెల్లడించారు.