అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేస్తున్న కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు నిర్మిస్తామని, ఎస్పీ కార్యాలయంతో సహా అన్ని కార్యాలయాలు ఒకే చోట ఏర్పాటుచేస్తామని ఏపీ ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్ తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ. . 4లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త కలెక్టరేట్లు నిర్మాణం జరుగుతుందని వెల్లడించారు. జిల్లాలు ఏర్పాటయ్యాక కేంద్ర ప్రభుత్వానికి నోటిఫై కోసం సమాచారం ఇస్తామని ఆయన వివరించారు.
కొత్త జిల్లాలపై అభ్యంతరాలు ఉంటే మార్చి 3 వరకు ప్రజల నుంచి సూచనలు తీసుకుంటామని తెలిపారు. మార్చి మూడో వారంలో కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్ ఇస్తామని ఆయన వెల్లడించారు. ఉగాది నుంచి కొత్త జిల్లాల పాలన ప్రారంభమవుతుందని అప్పటి లోగా అన్ని జిల్లాల్లో ఉద్యోగుల విభజన, ఉద్యోగుల ప్రమోషన్లు, వర్క్ టు సెర్వ్ కింద ఉద్యోగులను కేటాయిస్తామని అన్నారు.