అమరావతి : స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ జెండా రెపరెపలాడింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జెండాకు సెల్యూట్ చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ జెండా మనందరి ఆత్మగౌరవానికి, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీక అని కొనియాడారు. ఆనాడు వాదాలు, మార్గాలు వేరైనా స్వాతంత్య్రమే లక్ష్యంగా అందరూ పోరాడారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పింగళి వెంకయ్య జాతీయ జెండా ను రూపొందించి భారతీయుల గుండెగా తీర్చిదిద్దారని అన్నారు.
మన్యం వీరుడిగా ప్రాణాలర్పించిన అల్లూరి త్యాగాన్ని స్మరించుకోవాలని కోరారు. 75 ఏళ్లలో దేశం తిరుగులేని విజయాలు సాధించిందని పేర్కొన్నారు. ప్రపంచ ఫార్మా రంగంలో ఇవాళ భారత్ అగ్రస్థానంలో ఉందని, మన దేశం దిగుమతుల నుంచి ఎగుమతులకు వేగంగా అడుగులు వేసిందని జగన్ అన్నారు. 150 దేశాలకు ఆహారధాన్యాలు ఎగుమతి చేయగలుగుతున్నామని వెల్లడించారు.