Srikakulam | శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో విద్యార్థి పత్తిపాటి సృజన్ ఆత్మహత్య ఉద్రిక్తతకు దారితీసింది. సీనియర్ విద్యార్థుల దాడి వల్లే సృజన్ ప్రాణాలు తీసుకున్నాడని అతని తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాలేజీ ఆవరణలో బైఠాయించి నిరసన తెలిపారు. బాధ్యులను సస్పెండ్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అసలేం జరిగిందంటే.. గుంటూరు పట్టణానికి చెందని పత్తిపాటి శివకృష్ణ ప్రసాద్ – జ్యోతి దంపతుల కుమారుడు సృజన్ శ్రీకాకుళంలోని ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం ఉదయం 11 గంటలకు అతను ఎగ్జామ్‌కు హాజరుకావాల్సి ఉంది. కానీ ఆ పరీక్షకు సృజన్ హాజరుకాలేదు. ఈసీ డిపార్ట్మెంట్ బిల్డింగ్‌లోని మొదటి అంతస్తులోకి వెళ్లి.. ఎవరూ లేని ఒక రూమ్‌లో ఉరివేసుకున్నాడు. ఇది గమనించిన తోటి విద్యార్థులు కాలేజీ సిబ్బందికి సమాచారం అందించారు. వారి సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కాగా, కాలేజీలో ఓ అమ్మాయితో స్నేహంగా ఉండటం చూసి, అదే కాలేజీలో చదువుతున్న ఆమె అన్నదమ్ములు ఒకటిరెండు సార్లు వార్నింగ్ ఇచ్చారని తెలిసింది. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి 10 మంది కలిసి సృజన్‌ను కొట్టారని తోటి విద్యార్థులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే సీనియర్లు కొట్టడం వల్లే మనస్తాపం చెంది తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని సృజన్ తల్లి పత్తిపాటి జ్యోతి ఎచ్చెర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ” మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో అదే కాలేజీలో చదువుతున్న భాను ప్రకాశ్ నా కుమారుడు సృజన్‌ను తన గదికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ అమిత్, అజీజ్, అనీష్, అభిషేక్, సమీర్, మస్తాన్, చిన్నిబాబు ఉన్నారు. వాళ్లంతా కలిసి నా కొడుకును దుర్భాషలాడి తీవ్రంగా కొట్టారు. వాళ్ల కాళ్లు పట్టించుకుని మానసిక వేదనకు గురిచేశారు. సుమారు 4 గంటల పాటు చిత్రహింసలు చేశారు. అమిత్ కజిన్ సిస్టర్ సెకండియర్ స్టూడెంట్ అయి త్రిషితతో సృజన్ మాట్లాడటం చూసి తప్పుగా అర్థం చేసుకున్నారని.. దీనిపై త్రిషిత చెప్పినా వినకుండా నా కుమారుడిని చిత్రవధ చేశారు. దీంతో మానసికంగా కుమిలిపిపోయిన సృజన్ ఆత్మహత్య చేసుకున్నాడు ” అని జ్యోతి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుమారుడి చావుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే, సృజన్‌పై దాడి చేసిన 8 మంది విద్యార్థులను కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.

Iiit Srikakulam Srujan1

Iiit Srikakulam Srujan2

Iiit Srikakulam Srujan3