Minister Kolusu Parthasarathy | ప్రజలకు మేలు చేయాలని అనుకుంటే అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వాలని మంత్రి కొలుసు పార్థసారథి సూచించారు. వైసీపీ చేసిన అక్రమాలు ఆధారాలతో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కొలుసు మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీకి డబ్బులు చెల్లించలేదని అబద్ధ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అబద్ధాలు ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బిల్లులు చెల్లించకపోవడంతో గతంలో అనేక ఆస్పత్రులు ఆరోగ్యశ్రీని నిలిపివేశాయని గుర్తుచేశారు. ఇప్పటికైనా ఆరోగ్యశ్రీ పథకంపై తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు.
మీరు చేసిన మేలు ఏమైనా ఉంటే ప్రజలకు వివరించాలని మంత్రి కొలుసు పార్థసారథి సవాలు విసిరారు. పేదలకు వైద్యం అందకుండా చేసిన చేతగాని పాలన జగన్‌ది అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పరిస్థితి మెరుగుపరిచేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కోటిమందికి పథకం అమలు చేస్తామని చెప్పారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు.