అమరావతి : సినీ హాస్య నటుడు పృథ్వీరాజ్(Prithviraj ) ఏపీ మంత్రి అంబటి రాంబాబు( Minister Ambati Rambabu) పై సెటైర్లు వేశారు. రాబోయే ఎన్నికల్లో అంబటి రాంబాబు ఓడిపోతే జబర్దస్త్ షోలకు పనికి వస్తారని విమర్శించారు. అనంతపురం జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన పృథ్వీ మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ దరిద్రం పోతుందని అన్నారు.
వైసీపీ పార్టీలో ఇన్సెక్యూరిటీ ఉందని పేర్కొన్నారు. ఉప్పెన, సునామి వచ్చినప్పుడు ప్రశాంతత ఎలా ఉంటుందో అలానే ఏపీ ప్రజల్లో ఉందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 135 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో టీడీపీ, జనసేన గెలుస్తుందని జోస్యం చెప్పారు. రాబోయే కొత్త ప్రభుత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొని ఉంటుందని అన్నారు. మహిళలకు, పేదలకు, రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, ప్రభుత్వం వచ్చాక అనేక అద్భుతాలు జరుగుతాయని పేర్కొన్నారు.
వైసీపీకీ 175కు 175 సీట్లు వచ్చే పరిస్థితి ఉంటే 92 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులను ఎందుకు మార్చారని ప్రశ్నించారు. అంబటిలా తాను డ్యాన్స్ చేయలేనని, తాను పవన్ కల్యాణ్ సినిమాలో వేసిన శ్యాంబాబు పాత్రపై రాంబాబు ఏడ్చాడని ఆరోపించారు. తాను డైలాగులు చెప్పడం, పరుగెత్తడం చేస్తానని, రాంబాబు మాదిరిగా డ్యాన్స్‌లు చేయలేనని అన్నారు. ఆయన ఓడిపోతే జబర్దస్త్ కామెడి షోకు పనికివస్తారని విమర్శించారు.