IAS Officers Marriage | ఈ రోజుల్లో పెళ్లి అంటే చాలా ఖరీదైనదిగా మారిపోయింది. జీవితంలో ఒక్కసారి చేసుకునే ఈ వేడుక కలకాలం గుర్తుండిపోవాలని అర్భాటాలు, అట్టహాసాలకు వెళ్లి లక్షలు ఖర్చు పెడుతున్నారు. కానీ ఏపీలో ఇద్దరు యువ ఐఏఎస్‌లు మాత్రం ఎలాంటి హంగులకు వెళ్లకుండా కేవలం కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్, ఇంచార్జి జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న తిరుమణి శ్రీపూజ, మేఘాలయ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ఆదిత్య వర్మ వివాహం శుక్రవారం నాడు విశాఖపట్నంలో జరిగింది. వైజాగ్‌లోని కైలాసగిరి శివాలయంలో ఇరువురి కుటుంబీకులు, అత్యంత సన్నిహితుల మధ్య పూలమాలలు మార్చుకుని సాంప్రదాయ పద్ధతిలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
పెళ్లి అనంతరం నేరుగా వైజాగ్ వన్ టౌన్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి సంతకాలు చేసి తమ వివాహాన్ని చట్టబద్ధంగా నమోదు చేయించుకున్నాడు. విశాఖపట్నం డీఐజీ బాలకృష్ణ దగ్గరుండి ఈ వివాహ నమోదు ప్రక్రియను పర్యవేక్షించారు. తిరుమణి శ్రీపూజ, ఆదిత్య వర్మ ఇద్దరూ కూడా వేర్వేరు బ్యాచ్‌లకు చెందిన ఐఏఎస్ అధికారులు అని.. వీళ్లది పెద్దలు కుదిర్చిన వివాహమని వధువు తండ్రి వెంకటేశ్వర్లు తెలిపారు. కాగా, పెళ్లిళ్లు ఖరీదైనవిగా మారిపోయిన ఈ రోజుల్లో ఉన్నతాధికారులు నిరాడంబరంగా పెళ్లి చేసుకోవడంపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ias officers tirumani sri pooja and aditya varma marriage