అమరావతి : మహిళలను అగౌరవపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టేవారు ఏ పార్టీలో ఉన్నా వారి అంతు చూడాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila ) కోరారు. నాపై అసభ్యకర పోస్టులు పెట్టిన నర్నా రవీంద్రరెడ్డి(Ravindra Reddy) పై కేసు పెట్టానని, రవీంద్రరెడ్డి అరెస్టును స్వాగతిస్తున్నామని ట్విటర్లో పేర్కొన్నారు.
తల్లి, చెల్లి అనే ఇంగితజ్ఞానం లేకుండా పోస్టులు పెట్టారు. ప్రశ్నించే మహిళలపై అసభ్యకర పోస్టులతో రాక్షస ఆనందం పొందారని ఆరోపించారు. రాజశేఖర్రెడ్డికే పుట్టలేదని అవమానించిన కొందరు సైకోలు సోషల్ మీడియాను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. సమాజానికి మంచి చేసేది సోషల్ మీడియా ఉండాలని సూచించారు. సోషల్ సైకోల బాధితుల్లో నేను ఒకరినని ఆవేదన వ్యక్తం చేశారు.
అరాచక పోస్టులు పెట్టే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా అంతు చూడాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు. మరోసారి సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడాలంటే భయపడేలా అనునిత్యం చర్యలు కొనసాగాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.