అమరావతి : వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఆగడాలకు విసిగి జనసేన పార్టీలో చేరనున్నట్లు చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు(MLA Arani Srinivasulu) వెల్లడించారు. బుధవారం చిత్తూరులో మీడియా సమావేశంలో మాట్లాడారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్(Pawan Kalyan) సమక్షంలో గురువారం పార్టీలో చేరుతున్నానని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి చిత్తూరు నుంచి ఎమ్మెల్యేగా లేదా రాజ్యసభకు అవకాశం ఇస్తానని చెప్పి మోసం చేశారని వాపోయారు.
నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని అనేకసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. సొంత నిర్మాణ సంస్థ జేఎంసీ కన్స్ట్రక్షన్స్ ద్వారా చేపట్టిన పనులకు బిల్లులు రూ.73 కోట్లు ఆపేశారని పేర్కొన్నారు. బలిజ కులానికి చెందిన తనకు అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయని ఆరోపించారు. తనతో పాటు నియోజకవర్గానికి చెందిన ముఖ్యనాయకులు, అనుచరులు జనసేనలో చేరుతున్నానని పేర్కొన్నారు.