అమరావతి : భారతరత్న, నోబెల్ గ్రహిత మదర్ థెరిసా(MotherTeresa:) మానవతామూర్తి అని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) అన్నారు. మదర్ థెరిసా జయంతి సందర్భంగా జగన్ ఎక్స్ వేదిక ద్వారా స్పందించారు. ఎంతో మంది అనాథలు, అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపడమే కాదు వారికి విద్యాబుద్ధులు చెప్పించి వారి భవిషత్తుకు బంగారు బాటలు వేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు.
పేద ప్రజలు, రోగ పీడితులు, కుష్టువ్యాధి గ్రస్తులూ, అనాథ పిల్లలే తన ఆస్తిగా భావించి వారందరినీ అక్కున చేర్చుకున్నారని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ నగరంలోని నిర్మల్ హృదయ్ భవన్ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేలా సహాయ సహకారాలు అందించామని గుర్తు చేశారు. మదర్ థెరిసా జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నట్లు ప్రకటించారు.
ఏపీ ప్రజలకు శ్రీకృష్ణా జన్మాష్టమి (Srikrishna Janmastami) శుభాకాంక్షలు తెలిపారు. అందరిపైన, రాష్ట్రంపైన భగవంతుడి ఆశీస్సులు ఉండాలని అన్నారు. అధ్యాత్మికంగా శక్తినిచ్చే పండుగ ప్రజలందరినీ ఏకం చేస్తుందని, చెడును నిర్మూలించి ధర్మాన్ని కాపాడడంలో శ్రీకృష్ణుడి బోధనలు మానవాళికి ఆచరణీయమని అన్నారు.