ఎన్టీఆర్ జిల్లా : విజయవాడలోని కృష్ణలంక పోస్టాఫీసులో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దాదాపు రూ.కోటికి పైగా నిధులు గోల్మాల్ జరిగినట్టు తెలుస్తున్నది. డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు పక్కదారి పట్టినట్టుగా అధికారులు గుర్తించారు. అయితే, ఎంత మొత్తంలో గోల్మాల్ జరిగిందో తెలుసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ కుంభకోణం వెనక పోస్టు మాస్టర్ హస్తం ఉన్నట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు.
గతేడాది జూన్‌లో కృష్ణలంకలోని పోస్టాఫీస్‌లో పోస్టుమాస్టర్‌గా మనోజ్ విధుల్లో చేరారు. కృష్ణలంక ప్రాంతంలో ఎక్కువ మంది కూలీలే ఉన్నారు. ఈ పోస్టాఫీసులో 7 వేల వరకు పొదుపు, ఎఫ్డీ, ఆర్డీ ఖాతాలు ఉన్నాయి. డబ్బులు జమ చేయించుకుని నిధులు ఇతర ఖాతాలకు మళ్లించడం ద్వారా పెద్ద మొత్తంలో నిధులను తన సొంతానికి వాడుకున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తూ నమ్మబలికాడు. కొంతకాలం పాటు ఇలా సాఫీగా నడిపిన పోస్ట్‌మాస్టర్.. పొదుపు, ఆర్డీ, ఎఫ్డీ ఖాతాల్లో నగదు జమ చేసే వినియోగదారులకు పాస్ పుస్తకాలు ఇవ్వకుండా మోసం చేశారు. ఈ కుంభకోణం వెలుగులోకి రాగానే అధికారులు వేగంగా స్పందించి కుంభకోణానికి పాల్పడినట్లుగా అనుమానిస్తన్న పోస్ట్‌మాస్టర్ మనోజ్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఈ కుంభకోణం బయటకు పొక్కకుండా ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ.. లాభం లేకుండా పోయింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వినియోగదారులకు తెలియకుండా వారి డబ్బులతో మనోజ్ వ్యాపారాలు చేసినట్టుగా తెలుస్తున్నది. ఇప్పటివరకు తేలిన లెక్కల ప్రకారం రూ. కోటికిపైగా వసూలు చేసినట్లు తెలుస్తున్నది. ఈ వ్యవహారంపై అధికారులు విచారణ చేపట్టారు. ఆయన నుంచి దాదాపు రూ.10 లక్షలు రికవరీ చేసినట్లు సమాచారం. శాఖాపరమైన విచారణ కోసం వినియోగదారులు పాస్‌పుస్తకాలు, స్టేట్మెంట్లు, తదితర వివరాలతో సంప్రదించాలని పోలీసులు సూచిస్తున్నారు.