శ్రీశైలం: ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో (Srisailam) కార్తికమాస (Karthika Masam) సందడి నెలకొన్నది. కార్తిక దీపారాధన చేయడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. గంగాధర మండపం, ఆలయ ఉత్తర మాఢవీధిలో దీపారాధన చేసి మొక్కులు తీర్చుకున్నారు. కాగా, ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు పౌర్ణమి గడియలు ఉన్న అర్చకులు వెల్లడించారు.
దీంతో సాయంత్రం 6 గంటలకు శ్రీశైలంలోని పాతాళగంగ వద్ద పుణ్యనది హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు ఆలయం ముందు భాగంలోని గంగాధర మండపం వద్ద శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు జ్వాలాతోరణోత్సవం నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు.
శాస్త్రాలు, పండితులు తెలిపిన వివరాల ప్రకారం దీపం ప్రతిరోజూ వెలిగించాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఒక్కోరోజు దీపం వెలిగించడం కుదరదు. అయితే అలా దీపం వెలిగించపోవడం అనేది ఒక పొరపాటుగానే ఉండిపోతుంది. అలాంటి పొరపాట్ల వల్ల కలిగే పాపాలను తొలగించడానికి ఈరోజు ప్రత్యేకమైందని పండితులు చెబుతున్నారు. ఇవాళ 365 వత్తుల దీపాన్ని వెలిగించాలి. ఏడాది కాలంలో ఏరోజైనా దీపం వెలిగించడం మర్చిపోయినా…కుదరకపోయినా..నేడు వెలిగించే ఈ 365 వత్తుల దీపంతో పాపాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
ఈ 365 వత్తుల దీపం వెలిగించడం వల్ల ప్రాణకోటికి మేలు జరిగినట్లు అవుతుంది. కీటకాలు, పురుగులు ఈ దీపం నుంచి వెచ్చదనం పొందుతాయి. ఈ దీపకాంతి వాటిపై పడటం వల్ల వాటికి పునర్జన్మ లభిస్తుంది. ఆ పుణ్యఫలం దీపం వెలిగించినవారికి లభిస్తుందని పండితులు అంటున్నారు. ఆంజనేయస్వామి లంకా దహనం చేసింది కూడా ఈ రోజే. అందుకే నేడు ఆంజనేయ స్వామి ఆలయంలో దీపం వెలిగిస్తే మేలు జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఆలయాల్లో కొండెక్కిన దీపాలను వెలిగించడం వల్ల చాలా పుణ్యం లభిస్తుందని చెబుతున్నారు. నేడు భక్తులు, ఆలయాల్లో పూజల తర్వాత బ్రహ్మణులకు దానాలు చేసేటప్పుడు..తప్పనిసరిగా ఉసిరికాయను దానం ఇవ్వాలని పండితులు అంటున్నారు. దీని వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయి.