Srisailam | శ్రీశైలం : మల్లికార్జునస్వామి దేవస్థానం పరిధిలోని హోటల్స్ నిర్వాహకులతో ఈవో ఎం శ్రీనివాసరావు బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మల్లికార్జున కల్యాణ మండపంలో జరిగిన సమావేశానికి నంద్యాల జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్లు, జిల్లా లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఆయా హోటల్స్ నిర్వాహకులు తప్పనిసరిగా శుభ్రత పాటించాలని సూచించారు. ఈ విషయంలో ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వంటలకు తాజా కూరగాయలనే వాడాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో వంటావార్పు చేయొద్దని సూచించారు. అవసరానికి అనుగుణంగా మాత్రమే ఆహారపదార్థాలను అందుబాటులో ఉంచాలన్నారు. నిల్వ ఉన్న ఆహార పదార్థాలను అందించొద్దని సూచించారు. ముడి సరుకుల నాణ్యత ప్రమాణాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ధారించిన రూల్స్‌కు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులందరితో మర్యాదపూర్వకంగా మెదలాలని.. 18 సంవత్సరాల్లోపు బాల బాలికలను పనికి తీసుకోకూడదన్నారు. దేవాదాయ చట్టం ప్రకారం నిషేధిత పదార్థాలను విక్రయించొద్దని ఆదేశించారు.
హోటళ్ల పరిసరాల్లోనూ ఆధ్యాత్మికతతో భక్తులను ఆకట్టుకునేలా ఉండాలన్నారు. హోటల్స్ జంక్ ఫుడ్‌ను తొలగించాలని.. హోటల్స్ పనిచేసే సిబ్బంది చేతికి గ్లౌజ్‌లు, తలకు క్యాప్‌లను తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ఆహార పదార్థాలపై క్రిమి కీటకాలు వాలకుండా, దుమ్ము, ధూళీ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. తనిఖీల సమయంలో నియమాలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలుంటాయని హెచ్చరించారు. అలాగే, అధికంగా డబ్బులు తీసుకున్నా చర్యలుంటాయన్నారు. ప్లాస్టిక్ పేపర్స్, గ్లాస్లు, బాటిల్స్‌ను నిషేధించినట్లు తెలిపారు. టీ, కాఫీ, మంచినీటిని సైతం గాజు, స్టీల్ గ్రాస్లలో అందించాలని సూచించారు. అనంతరం ఫుడ్ సేఫ్టీ అధికారులు మాట్లాడుతూ హోటల్స్ నిర్వాహకులందరు ఆహారపదార్థాల తయారీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఐవీఆర్ సిస్టం ప్రకారం.. ప్రతి ఒక్కరు ఆహార పదార్థాలను సిద్ధం చేయాలన్నారు. టెస్టింగ్ సాల్ట్, ఫుడ్ కలర్స్ వాడడాన్ని పూర్తిగా నిషేధించాలన్నారు. కార్యక్రమములో సహాయ కార్యనిర్వహణాధికారి బీ మల్లికార్జునరెడ్డి, ప్రజాసంబంధాల అధికారి టీ శ్రీనివాసరావు, పర్యవేక్షకులు డీ రాధకృష్ణ, స్థానిక హోటళ్ల యజమానులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.