అమరావతి : వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ( YS Jagan Mohan Reddy) మరోసారి రాష్ట్రంలో పాదయాత్ర ( Padayatra ) చేయనున్నారని ఆ పార్టీకి చెందిన కీలక నాయకుడు, మాజీ మంత్రి పేర్నినాని ( Perni Nani ) వెల్లడించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి పాలనను ప్రజలకు వివరించేందుకు 2027లో మరోసారి ప్రజా సంకల్ప పేరిట పాదయాత్ర చేస్తారని తెలిపారు.
వైఎస్ జగన్ పాదయాత్ర మొదలు పెట్టి ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కార్యాలయ ఇన్చార్జి లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. పేర్ని నాని మాట్లాడుతూ తొలి పాదయాత్రలో వైఎస్ జగన్ 341 రోజులపాటు 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి లక్షలాది మందితో బాధలు పంచుకున్నారని పేర్కొన్నారు.
పాదయాత్రలో ప్రజల బాధలు తెలుసుకుని ప్రభుత్వంలోకి రాగానే పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. ప్రజలకు ఉచితంగా విద్య , వైద్యం ,రైతన్నకు అనేక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. చంద్రబాబు(Chandra Babu) మరోసారి అధికారంలోకి వచ్చిన తరువాత విధ్వంస పాలనను కొనసాగిస్తున్నారని వివరించారు.
పేదవాడికి వైద్యం మరింత చేరువ చేసేందుకు ఐదేళ్ల వైసీపీ పాలనలో 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించి 7 కాలేజీలను పూర్తి చేశారని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇంగ్లిష్ మీడియం రద్దు చేశారని, మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేస్తున్నాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పేర్నినానితో పాటు మేరుగ నాగార్జున, శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్ బాబు, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీలు అరుణ్‌కుమార్, వరుదు కల్యాణి, హనుమంతరావు, రుహుల్లా పాల్గొన్నారు.