హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలమైంది. 14 నియోజకవర్గాల్లో 20 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. 9 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ముంపు బారిన పడిన 294 గ్రామలకు చెందిన 13,227 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.
పోలీస్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు 600 మందిని రక్షించాయి. బాధితులకు 25 కిలోల బియ్యం, ఒక్కో కిలో చొప్పున నిత్యావసరాలను ఇస్తున్నామని, మత్స్యకారులు, చేనేతలకు అదనంగా 50 కిలోల బియ్యం ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సినీ నటుడు చిరంజీవి కోరారు.