అమరావతి : విశాఖపట్నం అచ్యుతాపురం సెజ్ (Achyutapuram Incident) లో జరిగిన ఘోర దుర్ఘటనపై ఉన్నతస్థాయి విచారణ కమిటీ (High Level Commitee) ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) వెల్లడించారు. కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గురువారం ఘటనలో మరణించిన కుటుంబాలను, గాయపడ్డ బాధితులను చంద్రబాబు పరామర్శించారు. అనంతరం రియాక్టర్(Reactor) పేలిన ఫార్మా కంపెనీని సందర్శించి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అచ్యుతాపురంలో మీడియా సమావేశంలో ఘటన వివరాలను, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఘటన జరిగిన ఫార్మా కంపెనీ యాజమాన్యంలోనూ అంతర్గత సమస్యలున్నట్టు గుర్తించామని తెలిపారు. పరిశ్రమలో ఏం జరిగింది. లోపాలపై కమిటీ విచారిస్తుందని వెల్లడించారు.
రాష్ట్రంలోని పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ (Safety Commitee) కోసం కమిటీ ఏర్పాటు చేస్తామని, ఈ కమిటీలో అన్ని విభాగాలను చెందిన అధికారులు ఉంటారని, ఈ కమిటీ విడివిడిగా కాకుండా ఉమ్మడిగా తనిఖీలు నిర్వహించి నివేదికలను అందిస్తుందన్నారు. పరిశ్రమలు రావాలి.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగాలని అదేస్థాయిలో పరిశ్రమల్లో కార్మికులు, ఉద్యోగుల భద్రత , ప్రజల భద్రతకు కూడ అంతే ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. రాంబిల్లి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
2019-24 వరకు ఉన్న వైసీపీ పాలనలో విశాఖలో 119 సంఘటనల్లో 120 మంది మృతి చెందారని ఆరోపించారు. రెడ్ క్యాటగిరీలోని పరిశ్రమలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మీడియా సమావేశంలో మంత్రులు అనిత, సుభాష్, ఎంపీ సీఎం రమేశ్ తదితరులు పాల్గొన్నారు.