హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాల వ్యవహారం ఆ రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అదే కళాశాలకు చెందిన ఫైనలియర్ విద్యార్థి, హాస్టల్‌కు చెందిన ఓ విద్యార్థిని ద్వారా అమర్చిన ఆ సీక్రెట్ కెమెరాల్లో విద్యార్థినుల వీడియోలను రికార్డు చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. సుమారు 300 ఫొటోలు, వీడియోలను విద్యార్థులకు, ఇతరులకు అమ్మినట్టు ఆరోపణలు ఉన్నాయి. కాలేజీలో జరిగిన ఈ ఘటనపై విద్యార్థినులు గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు కళాశాల ఆవరణలో ఆందోళనకు దిగారు.
పలువురు స్థానికులు కూడా వారికి మద్దతుగా నిలిచారు. వారం క్రితమే వాష్‌రూమ్‌లో రహస్య కెమెరాను గుర్తించి యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఈ సందర్భంగా విద్యార్థినులు మండిపడ్డారు. ఇదే హాస్టల్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని తన బాయ్‌ఫ్రెండ్ సూచనతో ఈ రహస్య కెమెరాలను అమర్చారని, వీడియోలు, ఫొటోలను ఇతరులకు అమ్ముకుంటున్నారని విద్యార్థినులు ధ్వజమెత్తారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేయబోతుండగా, పోలీసులు అక్కడికి చేరుకొని వారించారు. రహస్య కెమెరా అమర్చిన సీనియర్ విద్యార్థి, బాయ్స్ హాస్టల్లో ఉంటున్న విజయ్‌కుమార్‌ను ఈ సందర్భంగా పోలీసులు అరెస్టు చేసి, అతని లాప్‌టాప్‌ను సీజ్ చేసి, దర్యాప్తు చేపట్టారు.
ఓ విద్యార్థినిని బ్లాక్మెయిల్ చేసి ఆమె ద్వారా వాష్‌రూమ్‌లలో హిడెన్ కెమెరాలను అమర్చినట్టు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఆ కెమెరాల్లో రికార్డయిన 300 ఫొటోలు, వీడియోలను నిందితుడు విజయ్‌కుమార్ ఇతరులకు అమ్మినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళల వాష్‌రూమ్‌లో కెమెరాలను అమర్చిన విద్యార్థిని ఎవరు? రికార్డయిన ఫొటోలు, వీడియోలను ఎవరెవరికి షేర్ అయ్యాయన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ స్పందించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ఘటన నేపథ్యంలో గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీకి యాజమాన్యం సెలవులు ప్రకటించింది.