అమరావతి : అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్ ( Achyutapuram SEZ) లో ఉన్న ఫార్మా కంపెనీలో రియాక్టర్‌పేలి కార్మికులు మృతి చెందడం దురదృష్టకరమని ఏపీ కార్మికశాఖ మంత్రి సుభాష్ (Minister Subhash) పేర్కొన్నారు. ఘటనా స్థలంలో కలెక్టర్, ఎస్పీ పరిస్థితిని సమీక్షిస్తున్నారని తెలిపారు. మృతుల వివరాలు తెలిసేందుకు కొంత సమయం పడుతుందని అన్నారు. భారీగా పొగ వల్ల సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందని వెల్లడించారు.
బుధవారం ఏపీలోని అనకాపల్లి (Anakapalli) జిల్లా రాంబిల్లి మండంలోని సెజ్‌లోని ఎస్సెన్సీయా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన(Reactor Blast) ఘటనలో ఇప్పటి వరకు 7గురు చనిపోయారు. మరికొందరి పరిస్థితి ఆందోళనరంగా ఉంది. మృతుల సంఖ్య గంటగంటకు పెరుగుతుంది. 25 మంది గల ఎన్డీఆర్ఎఫ్(NDRF) బృందం ఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ ఘటనలో మొత్తం 50 మంది గాయపడగా పలువురి పరిస్తితి విషమంగా ఉంది.
రియాక్టర్ పేలిన తరువాత ఓ భవనం కుప్పకూలడంతో ఆ శిథిలాల కింద మరికొందరు కార్మికులు ఉండవచ్చని భావిస్తున్నారు. ఫార్మా కంపెనీ మూడో అంతస్తులో పలువురు కార్మికులు చిక్కుకోగా అగ్నిమాపక సిబ్బంది వారిని క్రేన్ సహాయంతో సురక్షితంగా కిందకు దించారు. మొత్తం 12 అగ్నిమాపక దళాలు మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పేలుడు దాటికి భారీ శబ్ధం రావడం, సమీప ప్రాంతాల్లో దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
పేలుడు సమయంలో మొత్తం 300 మంది ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు(Chandra Babu) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఘటనపై కలెక్టర్‌తో మాట్లాడారు. తక్షణ సహాయ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.