అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఊరట లభించింది. ఆయనపై దాఖలైన అనర్హత పిటిషన్‌పై లోక్‌సభ స్పీకర్ కార్యాలయం స్పందించింది. వైసీపీ అధినేత, సీఎం జగన్‌పై, ఆ రాష్ట్ర మంత్రులపై ఆరోపణలు చేయడం అనేది అనర్హత చర్యల కిందకు రాదని లోక్‌సభ స్పీకర్ కార్యాలయం స్పష్టం చేసింది. లోక్‌సభలో పార్టీ జారీ చేసిన విప్‌ను ఉల్లంఘించిన సమయంలోనే అనర్హత కిందకి వస్తుందని వెల్లడించింది. దీంతో రఘురామ కృష్ణంరాజుపై వైసీపీ ఎంపీ భరత్ ఇచ్చిన పిటిషన్ వీగిపోయింది. ఇదే సమయంలో వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యేల విషయంలో ఏం చర్యలు తీసుకుంటున్నారని ఈ సందర్భంగా రఘురామ కృష్ణంరాజు.. వైసీపీ నాయకత్వాన్ని ప్రశ్నించారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలంటూ ఆ పార్టీ లోక్‌సభ చీఫ్ విప్ మార్గాని భరత్ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు పిటిషన్ అందించారు. రఘురామపై అనర్హత వేటు వేయాలని ఆయన స్పీకర్‌ను కోరారు. దాంతో విచారణ జరపాలంటూ సదరు పిటిషన్‌ను స్పీకర్ ఓం బిర్లా.. ప్రివిలేజ్ కమిటీకి పంపించారు.
ప్రాథమిక దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలన్న స్పీకర్ సూచన మేరకు లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ విచారణ జరిపింది. కమిటీ ముందు వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్ హాజరై తన వాదనలు వినిపించారు. పార్టీ అధినేతతోపాటు సీఎం, మంత్రులపై ఆరోపణలు, విమర్శలు చేసినంత మాత్రాన అనర్హత వేటు వేయలేమని.. లోక్‌సభలో పార్టీ విప్‌ను ధిక్కరించే సందర్భంలోనే అలాంటి చర్యలు తీసుకోవచ్చని స్పీకర్ కార్యాలయం స్పష్టం చేసింది. దాంతో రఘురామ కృష్ణంరాజుకు గొప్ప రిలీఫ్ లభించినట్లయింది.