Gudivada Amarnath | అసెంబ్లీ సాక్షిగా చిరంజీవిపై హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా స్పందించారు. చిరంజీవి అంటే బాలకృష్ణకు ఈర్ష్య అని, గతంలో చిరంజీవిని ఆయన చాలాసార్లు అవమానించారని అన్నారు. అసలు బాలకృష్ణకు, చిరంజీవికి పోలేకే లేదని తెలిపారు. అనకాపల్లిలో గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. చిరంజీవి స్వయంకృషితో ఎదిగిన వ్యక్తి అని.. బాలకృష్ణ తండ్రి పేరు చెప్పుకొని వచ్చిన వ్యక్తి అని అన్నారు.
బాలకృష్ణకు చిరంజీవికి మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని తన ఫీలింగ్ అని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. సినీ ఇండస్ట్రీ బాగుండాలని జగన్మోహన్ రెడ్డిని చిరంజీవి కలిస్తే బాలకృష్ణ ఓర్వలేకపోయాడని విమర్శించారు. కన్నతండ్రిని చెప్పులు వేయించి, బట్టలు ఊడదీస్తే ఇంట్లో కూర్చున్న సంస్కారం లేని వ్యక్తి బాలకృష్ణ అని మండిపడ్డారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై ఇంతమంది స్పందిస్తున్నప్పటికీ.. జనసేన నుంచి ఏ ఒక్కరూ మాట్లాడకపోవడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలని వ్యాఖ్యానించారు. గతంలో జనసైనికులను బాలయ్య సంకరజాతి నా కొడుకులు అని మాట్లాడారని.. పవన్ కల్యాణ్ తల్లిని అవమానించినప్పటికీ టీడీపీని సమర్థించిందని తెలిపారు. పవన్ కల్యాణ్‌ను ఈ స్థాయికి తీసుకొచ్చిన తన అన్న చిరంజీవిని బాలయ్య కించపరుస్తూ మాట్లాడినప్పటికీ.. పవన్ కల్యాణ్ స్పందించకపోవడాన్ని జనసైనికులు, ప్రజలు గమనించాలని కోరారు.
అంతకుముందు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో అమర్నాథ్ ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేశారని తెలిపారు. ఏ తప్పు చేయకపోయినా కక్షపూరితంగా మిథున్ రెడ్డిని అరెస్టు చేశారని పేర్కొన్నారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్‌ను మాత్రమే ప్రభుత్వం అనుసరిస్తుందని మండిపడ్డారు. పార్టీ నేతలకు ఏ సమస్య వచ్చినా పార్టీ కేడర్ అంతా అండగా ఉంటామని తెలిపారు. మిథున్ రెడ్డి అరెస్టుకు కచ్చితంగా ప్రతీకారం ఉంటుందని హెచ్చరించారు.