TTD | తిరుమల-తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం అయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో తొలి రోజు ఆదివారం రాత్రి శ్రీదేవి-భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి పరమపద వైకుంఠనాథుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఏడు తలల పెద శేష వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అనుగ్రహం కల్పించారు.
ఆది శేషుడు తన పడగనీడలో స్వామి వారిని సేవిస్తూ దాస్య భక్తి ప్రదర్శించారు. ఆదిశేషుడు రామావతారంలో శ్రీహరికి తమ్ముడు లక్ష్మణుడిగా, ద్వాపర యుగంలో శ్రీమన్నారాయుడికి అన్నగా బలరాముడిగా జన్మించారు. ఈ వాహన సేవలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు పాల్గొన్నారు. స్వామి వారి వాహన సేవకు ముందు కళా బృందాల ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.