తిరుమల : త్వరలోనే టీటీడీ పాలకమండలి(TTD Board) నియామకం జరుగుతుందని ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Minister Anam Ramnarayana Reddy) వెల్లడించారు. మంగళవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బోర్డు నియామకంపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) కసరత్తు చేస్తున్నారని వెల్లడించారు.
టీటీడీ పాలకమండలితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 27 వేల దేవాలయాల పాలకమండళ్లను త్వరలోనే నియమిస్తామని స్పష్టం చేశారు. లడ్డు వివాదంతో పాటు తిరుమలలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించిందని తెలిపారు. సిట్ నివేదిక వచ్చిన తరువాత విజిలెన్స్, సిట్ నివేదికలపై ప్రభుత్వం పరిశీలన జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వివరించారు.
రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో నెయ్యితో పాటు ముడి సరుకులను, నాణ్యతను పరిశీలించాకే వినియోగించాలని ఆలయ అధికారులకు ఆదేశించినట్లు చెప్పారు. అక్టోబర్ 4 నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.