Srisailam | శ్రీశైలం : కృష్ణాష్టమి సందర్భంగా శ్రీశైలం దేవస్థానంలో ఉదయం గోవుపూజ ఘనంగా నిర్వహించారు. క్షేత్రంలో నిత్యం ప్రాతఃకాలంలో నిత్యసేవగా గోపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుండగా జన్మాష్టమి సందర్భంగా నిత్యసేవతో పాటు విశేషం జరిపించారు. మొదట ఆలయప్రాంగణంలో ఉన్న గోకులంలో ఆవుదూడలకు పూజాధికాలు నిర్వహించారు. అంతకు ముందు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు, వేదపండితులు పూజా సంకల్పం పఠించారు. ఆ తర్వాత కార్యక్రమంగా నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూ జరిపించారు. శ్రీసూక్తంతోనూ, గో అష్టోత్తరమంత్రంతోనూ గోవులకు షోడశ ఉపచారాలతో పూజాధికాలు జరిపించారు. చివరగా గోవులకు నివేదన, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. దేవస్థాన గో సంరక్షణశాలలో కూడా శ్రీకృష్ణుడి, గోవులకు పూజలు చేశారు.
వేద సంస్కృతిలో గోవుకు ఎంతో విశేషస్థానం ఉందని.. వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, పురాణాలు అన్నీ గోపూజ ఫలితాన్ని విశేషంగా పేర్కొంటున్నాయని ఆలయ పండితులు తెలిపారు. గోవు సకల దేవతలకు ఆవాస స్థానమని.. దాన్ని పూజించడం ద్వారా దేవతలందరినీ పూజించిన ఫలితం లభిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయని చెప్పారు. జగన్మాత లలితాపరమేశ్వరి గోవురూపంలో భూమిపై సంచరిస్తుందని చెప్పబడిందన్నారు. తాను చేసిన ప్రతిపనిలో వైశిష్ట్యాన్ని బోధించిన శ్రీకృష్ణపరమాత్ముడు ఆవుల మంద అధికంగా ఉన్న కారణంగా గోకులంగా పేరొందిన రేపల్లెలో పెరిగి గోవులను కాసి, గోపాలునిగా పేరుగాంచి.. గోవు అనంత మహిమను లోకానికి తెలియజేశాడని.. ఈ కారణంగానే గోకులాష్టమి రోజున గోవును పూజించడం సంప్రదాయంగా మారిందన్నారు. కార్యక్రమంలో ఈవో డీ పెద్దిరాజు, ఏఈవో ఐఎన్వీ మోహన్, పర్యవేక్షకురాలు స్వర్ణలత, అర్చకులు పాల్గొన్నారు.