అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ(YCP) కి చెందిన కీలకనేతలు పార్టీలు మారుతున్నారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు దగ్గరి బంధువైన బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసిన 24 గంటల్లోనే మరో కీలక నేత రాజీనామాచేయనున్నారు. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే (Former MLA) సామినేని ఉదయభాను (Udayabhanu) ఈనెల 22న జనసేన పార్టీలో చేరబోతున్నట్లు గురువారం ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జనసేన(Janasena) బలోపేతం కోసం కృషి చేస్తామని వెల్లడించారు. .. ఏ షరతులు లేకుండా జనసేనలో చేరుతున్నానని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ విధానాలు నచ్చకే పార్టీని వీడి జనసేనలో చేరుతున్నానని అన్నారు. 12 సంవత్సరాల పాటు వైసీపీకి అన్ని రకాలుగా సహాయసహకారాలు అందించాను. జిల్లా అధ్యక్షుడిగా పనిచేశానని తెలిపారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సీఎం జగన్‌కు జిల్లా సమస్యల పరిష్కారానికి వినతిపత్రం ఇస్తే ఏనాడు వాటి గురించి పట్టించుకోలేదని విమర్శించారు. ఎన్నికల్లో అధికారం కోల్పోయినా కూడా నాయకులు, కార్యకర్తల పట్ల జగన్ నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. వైసీపీలో ఉంటే ప్రజలకు ఎలాంటి సహాయం చేయలేకపోతున్నామనే బాధ, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు.