Srisailam | ఆదిదంపతులు కొలువైన శ్రీగిరి క్షేత్రంలో ఈ నెల 11న మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు మొదలవనున్నాయి. పంచాహ్నిక దీక్షతో ఏడురోజుల పాటు జరుగనుండగా.. ఈ నెల 17వ తేదీతో ఉత్సవాలు ముగుస్తాయి. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో ఏటా రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. మకర సంక్రమణం సందర్భంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరుగనుండగా.. మహాశివరాత్రి సమయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. ఈ నెల 11న ఉదయం 8.45 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశ కార్యక్రమంలో ఉత్సవాలకు శ్రీకారం చుడుతారు. అనంతరం లోకకల్యాణాన్ని ఆకాంక్షిస్తూ అర్చకులు బ్రహ్మోత్సవ సంకల్పాన్ని పఠిస్తారు. ఆ తర్వాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు గణపతిపూజ నిర్వహిస్తారు.
అనంతరం వృద్ధి, అభ్యుదయాల కోసం స్వస్తి పుణ్యహవాచనం జరుగుతుంది. ఆ తర్వాత చండీశ్వరుడికి విశేష పూజలు జరుగుతాయి. ఈ క్రతువు ముగిసాక కంకణధారణ, రుత్విగ్వరణం, అఖండదీపారాధన, వాస్తుపూజ, వాస్తుహోమం, మండపారాధనలు, కలశస్థాపన, పంచావరణార్చనలు, జపానుష్ఠానములు, పారాయణలు నిర్వహిస్తారు. ఇక సాయంత్రం 5.30 గంటల నుంచి అంకురారోపణ, అగ్నిప్రతిష్టపాన కార్యక్రమాలు, సాయంత్రం 7 గంటల నుంచి ధ్వజారోహణ, ధ్వజపటావిష్కరణ క్రతువులు జరుగుతాయి. ముక్కోటి దేవతలను, సకల సృష్టిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ధ్వజారోహణ కార్యక్రమం జరిపిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు, రుద్రహోమం, చండీహోమం, నిత్యహవనాలు కార్యక్రమాలు చేయనున్నారు.
బ్రహ్మోత్సవాల్లో రెండోరోజైన 12 నుంచి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార వాహనసేవలు జరుగుతాయి. 14న సంక్రాంతి రోజున కల్యాణం, 16న ఉదయం యాగపూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూలస్నానం, సాయంత్రం సదస్యం, నాగవల్లి, ధ్వజావరోహణ కార్యక్రమాలు జరుగుతాయి. చివరిరోజైన 17న పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంత సేవలతో ఉత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాల సందర్భంగా 11 నుంచి 17 మధ్య ఆర్జిత, ప్రత్యక్ష, పరోక్ష సేవలను రుద్రహోమం, చండీహోమం, మృత్యుంజయహోమం, గణపతి హోం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం, స్వామిఅమ్మవార్ల కల్యాణం, ఉదయాస్తమానసేవ, ప్రాతఃకాలసేవ, ఏకాంతసేవలను నిలిపివేశారు.
12న ఉత్సవాలకు అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలుంటాయి.
13న కైలాస వాహనసేవపై భ్రమరాంబ అమ్మవారితో కలిసి మల్లికార్జునుడు విహరిస్తారు.
14న నందివాహనసేవ, బ్రహ్మోత్సవ కల్యాణం ఉంటుంది
15న పూర్ణాహుతి, త్రిశూలస్నానం, సదస్యం, నాగవల్లి, ధ్వజావరోహణ
17న అశ్వవాహన సేవ (ఆలయ ఉత్సవం) పుష్పోత్సవం, శయనోత్సవం ఉంటాయి.