తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు (Brahmotsavam) వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం రెండో రోజుల ఏడు తలలు గల పెద్దశేషవాహనంపై (Pedashesha vahanam) వైకుంఠనాథుని అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు వాహనసేవ సాగింది.
బ్రహ్మోత్సవాలలో రెండవ వాహనం పెద్దశేషుడు లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడిగా, సఖుడిగా, శయ్యగా, సింహాసనంగా, ఛత్రంగా సమయోచితంగా సేవలందిస్తాడని అర్చకులు వివరించారు. ఈరోజు రాత్రి అమ్మవారు హంస వాహనంపై భక్తులకు కనువిందు చేయనున్నారని వివరించారు.
వాహనసేవల్లో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్‌స్వామి, ఈవో జె. శ్యామల రావు, జెఈవోలు వీరబ్రహ్మం, గౌతమి, ఆలయ డిప్యూటీ ఈవో గోవింద రాజన్, ఆలయ అర్చకులు బాబు స్వామి, భక్తులు పాల్గొన్నారు.