Tirumala | తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు కనుల పండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదోరోజు వేంకటేశస్వామివారు గరుడ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. తిరుమలలో సాయంత్రం 6.30 గంటల సమయంలో గరుడ సేవ మొదలు కాగా.. లక్షలాది మంది భక్తులు రాగా.. గోవింద నామస్మరణతో ఏడుకొండలు మార్మోగాయి. గరుడ సేవ సందర్భంగా మలయప్పస్వామివారికి మకరకంఠి, లక్ష్మీహారాన్ని అలంకరించారు. అయితే, ఈ ఆభరణాలను శ్రీవారి మూలవిరాట్టుకు అలకరిస్తారు. ఏడాది ఒకరోజు మాత్రమే.. కేవలం గరుడ సేవ రోజున మాత్రమే ఉత్సవమూర్తి అయిన మలయప్పస్వామివారికి అలంకరించడం విశేషం. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు ఉదయం మోహినీ అవతారంలో దర్శనమిచ్చారు. మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై భక్తులను కటాక్షించారు. కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు.
గరుడ సేవ సందర్భంగా తిరుమల క్షేత్రం జనసంద్రంగా మారింది. స్వామివారి ప్రియ వాహనమైన గరుత్మంతునిపై స్వామివారు మాడవీధుల్లో విహరించగా.. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. గరుడ వాహనంపై మలయప్పస్వామివారిని చూసి భక్తులు పులకించిపోయారు. మాడవీధుల గ్యాలరీల్లోకి దాదాపు రెండు లక్షల మందికిపైగా భక్తులు చేరుకున్నారు. నందకం, రామ్బగీచా, లేపాక్షి ప్రాంతాల్లోనూ భక్తులు బారులు తీరారు. తిరుమలలో వాహనాల పార్కింగ్ ప్రాంతాలన్నీ వాహనాలతో నిండిపోగా.. ప్రైవేటు వాహనాలను కొండపైకి నిలిపివేశారు. కేవలం ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతించారు. బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. దాంతో లక్షలాది మంది భక్తులు ఏడుకొండలకు తరలివచ్చారు. తిరుమల గిరులకు దాదాపు 4లక్షల మంది భక్తులు చేరుకున్నారని అంచనా. సర్వాలంకార భూషితుడై గరుడ వాహనంపై విహరించిన స్వామివారిని చూసి భక్తులు తన్మయత్వం పొందారు. స్వామివారిపైకి కర్పూర హారతులు పలికి తమ భక్తిని చాటుకున్నారు. భక్తుల రద్దీ మేరకు టీటీడీ అధికారులు ఏర్పాటు చేశారు. ఇబ్బందులు లేకుండా పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.