AP TDP President | టీడీపీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును పార్టీ అధినేత నారా చంద్రబాబు నియమించారు. ఈ మేరకు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకూ ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కింజారపు అచ్చెన్నాయుడిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఆయన స్థానంలో పార్టీ ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును నియమించారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్పై పల్లా శ్రీనివాసరావు గెలుపొందారు. రాష్ట్రంలో అందరికంటే ఎక్కువగా 95,235 ఓట్ల మెజారిటీతో పల్లా శ్రీనివాస రావు గెలుపొందారు.
‘విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడిగా సమర్ధవంతంగా పని చేసిన పల్లా శ్రీనివాసరావు నూతన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకూ టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పార్టీని నడిపించడంలో అద్భుత పనితీరు కనబరిచిన సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడికి అభినందనలు. విపక్షంలో ఉన్నప్పుడు పలు సవాళ్లు, సమస్యలను ఎదుర్కొని పార్టీ బలోపేతానికి అచ్చెన్నాయుడు ఎనలేని కృషి చేశారు’ అని చంద్రబాబు ఓ ప్రకటనలో తెలిపారు.