అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మహిళలకు నెలరోజుల్లో ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి(AP Minister Ramprasad Reddy) అన్నారు. ఆదివారం సచివాలయం నాలుగో బ్లాక్లో ప్రత్యేక పూజలు అనంతరం రవాణా, క్రీడలశాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కల్పించే దస్త్రంపై తొలి సంతకం చేశారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ(RTC) లో ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టిని సారిస్తామని వెల్లడించారు. ఆర్టీసీ బస్సు ప్రమాదాలు లేని రాష్ట్రమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎవరికి ఇబ్బందులు రాకుండా ఉచిత బస్సు(Free Travel Bus) ప్రయాణం అమలు త్వరలోనే ప్రారంభిస్తామని వివరించారు.
రాష్ట్రంలో క్రీడా వసతులు మెరుగుపరుస్తామని , అందరికీ క్రీడలు చేరువ చేసే విధంగా ప్రణాళికలను రూపొందిస్తామని పేర్కొన్నారు. గత ఐదేండ్ల వైసీపీ (YCP)పాలనలో యువత కోసం ఏ ఒక్క పథకాన్ని అమలు చేసిన పాపాన పోలేదని విమర్శించారు. స్టెప్ ద్వారా రాబోయే కాలంలో నిరుద్యోగ యువతలోని నైపుణ్యాలను గుర్తించి వారికి శిక్షణ ఇచ్చిన ఉద్యోగ, ఉపాధి కల్పన ద్వారా ఆర్థికంగా ఆదుకుంటామని స్పష్టం చేశారు. తనకు అప్పగించిన శాఖలను సమర్ధవంతంగా నిర్వహిస్తానని పేర్కొన్నారుజ