అమరావతి: పోలవరం పరిహారం పంపిణీలో అక్రమాలు జరిగినట్లు తేలింది. దాంతో ఈ కేసులో ఉన్న అధికారుల అరెస్ట్ పరంపర కొనసాగుతుంది. ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 17కు చేరింది. తాజాగా మరో నలుగురు అధికారులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కలెక్టర్ స్థాయి అధికారులను రంపచోడవరం పోలీస్ స్టేషన్లో ఉంచి విచారిస్తున్నట్లుగా సమాచారం.
పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలవరం ప్రాజెక్టులో భాగంగా నష్టపోయిన వారికి ప్రభుత్వం పరిహారం అందజేస్తున్నది. అయితే, పలువురు అధికారులు, సిబ్బంది పలువురు బాధితులకు అందాల్సిన పరిహారంలో అక్రమాలు చేసినట్లు ఫిర్యాదులు అందాయి. దాంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అక్రమాలు నిజమే అని తేలడంతో.. ఇప్పటికే దేవీపట్నం తాశీల్దారు వీర్రాజును అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. తాజాగా ఆర్ఐ బాపిరాజు, వీఆర్వో సత్తార్, సర్వేయర్ లక్ష్మణ్‌లను కోర్టులో హాజరుపర్చగా వారికి రిమాండ్ విధించారు. దాంతో వారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ కలెక్టర్ మురళి, విశ్రాంత స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామోజీని కూడా అరెస్టు చేసి పోలీసులు విచారించారు. ప్రస్తుతం వీరు రంపచోడవరం పోలీసుస్టేషన్లో ఉన్నారు. వీరితోపాటు రెవెన్యూ అధికారులు, దళారీలు సహా మరో 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. విచారణను వేగవంతం చేసిన పోలీసులు.. నిందితులందరినీ అదుపులోకి తీసుకుంటూ ఎఫ్ఐఆర్ను సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం. అయితే, ఎంత మేర పరిహారం జేబుల్లో వేసుకున్నారనే విషయం తెలియరాలేదు.