విశాఖపట్నంలో గంజాయి కుంభకోణం మరోసారి వెలుగు చూసింది. వైజాగ్ నుంచి గోవాకు గంజాయి తరలిస్తూ నలుగురు పట్టుబడ్డారు. గోవాకు గంజాయి తరలిస్తున్న వీరు.. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో డ్రగ్స్‌ను విశాఖకు తెస్తున్నారు. పక్కాగా అందిన సమాచారం మేరకు అచ్యుతాపురం ఎస్వీఎస్ పోలీసులు కాపు కాసి గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 7 ఎండీఎంఏ మాత్రలు, 4 ఎండీఎంఏ క్లస్టర్ పౌడర్ పౌచ్‌లు, 100 గ్రాముల గంజాయి, నాలుగు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తంగేటి భరత్ అనే వ్యక్తి విశాఖపట్నం ఏజెన్సీ నుంచి గంజాయిని తీసుకెళ్లి గోవాలో విక్రయిస్తుంటాడు. తిరుగు ప్రయాణంలో అక్కడ డ్రగ్స్ కొనుగోలు చేసి విశాఖపట్నం జిల్లాలో విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారం అందింది. దీంతో భరత్‌పై కన్నేసిన అచ్యుతాపురం ఎస్వీఎస్ పోలీసులు.. ఆయన రాకపోకల గురించి ఆరా తీశారు. ఆదివారం గంజాయి సరఫరా చేస్తుండగా భరత్‌ను పట్టుకున్నారు. భరత్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని ఎస్వీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. గతంలో గంజాయి కలిగి ఉన్నారనే ఆరోపణలపై భరత్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు నూకరాజు, దుర్గాప్రసాద్, సిహెచ్ వెంకటేష్‌లను పోలీసులు అరెస్టు చేశారు.
రాష్ట్రం డ్రగ్స్, గంజాయికి హబ్‌గా మారిందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి వాడకం, సరఫరా పెరిగిపోయిందన్న అంశాన్ని ఆయన పార్లమెంట్లో లేవనెత్తారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం మాఫియాలు రాజ్యమేలుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడినా ప్రతిపక్ష నేతలపై అధికార పార్టీ దాడులు చేయిస్తున్నదని మండిపడ్డారు.