అమరావతి : ఏపీలోని పల్నాడు జిల్లాల్లో అధికార కూటమి ప్రభుత్వం ఇష్టానురీతిన వ్యవహరిస్తున్నారని వైసీపీ నాయకుడు , మాజీ మంత్రి మేరుగు నాగార్జున(Merugu Nagarjuna) ఆరోపించారు. వైసీపీ నాయకులను భయపెట్టాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. మంగళవారం పల్నాడు జిల్లాలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు (Nambur Shanker Rao) పై టీడీపీ నాయకులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
పల్నాడులో జరుగుతున్న దాడులపై హోం మంత్రి అనిత ఎందుకు స్పందించడం లేదని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసుల సమక్షంలోనే దాడులు, విధ్వంసాలు చేయడం దారుణమని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు కర్రలు, రాళ్లు తీసుకుని రోడ్లపైకి వస్తుంటే వారిని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. దాడులకు పాల్పడుతున్న అధికార పక్ష నాయకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.