Avanthi Srinivas | ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోల్పోయిన వైసీపీ (YCP) నుంచి నేతలు ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు జగన్‌కు హాండిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు రాజసభ సభ్యులు, నలుగురు ఎమ్మెల్సీలు, పలువురు జెడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు పార్టీకి, పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ (Avanthi Srinivas) కూడా వారి బాటలో నడువనున్నారు. గత కొంత కాలంగా వైసీపీకి దూరంగా ఉంటున్న ఆయన.. ఫ్యాన్ పార్టీకి గుడ్‌బై చెప్పి గ్లాస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తున్నది. నేడో రేపో పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్నది.
విషయమై ఇప్పటికే తన అనుచరులతో చర్చించారని, పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అధినేత వైఎస్ జగన్ వ్యవహార శైలి, పార్టీ తీరు నచ్చక అవంతి రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తున్నది. అయితే దీనిపై అవంతి శ్రీనివాస్ ఇప్పటివరకు స్పందించలేదు.
2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరిన అవంతి శ్రీనివాస్.. భీమిలి నుంచి పోటీచేసి విజయం సాధించారు. అనంతరం చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశాక ఆ పార్టీలో కొనసాగారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. అయితే 2109 ఎన్నికల సమయంలో టీడీపీకి గుడ్‌బై చెప్పారు. వైసీపీలో చేరిన ఆయన భీమిలి నుంచి పోటీచేసి టీడీపీ అభ్యర్థి సబ్బం హరిపై గెలుపొందారు. ఆ తర్వాత జగన్ కేబినెట్లో రెండున్నరేండ్ల మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున భీమిలి నుంచి పోటీచేసి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చేతిలో ఓడిపోయారు. ఈనేపథ్యంలో మరోసారి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు.