హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన కొనసాగుతున్నదని, నీచ సంస్కృతి రాజ్యమేలుతున్నదని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. దీనిని దేశం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదని, అందుకే రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై ప్రధాని మోదీని కలిసి వివరిస్తామని చెప్పారు. ఇక్కడ నెలకొన్న పరిస్థితులను నిరసిస్తూ ఢిల్లీలో ధర్నా చేస్తామని, రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తామని తెలిపారు.
పల్నాడు జిల్లా వినుకొండలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని జగన్ శుక్రవారం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని, హత్యారాజకీయాలు పెరిగిపోయాలని ఆవేదన వ్యక్తంచేశారు. వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలపైనా దాడి చేశారని చెప్పారు. మిథున్‌రెడ్డి, రెడ్డప్పపై దాడి చేసి వాళ్లపైనే మర్డర్ కేసు పెట్టారని వాపోయారు. గత ఐదేండ్లలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు జరగలేదని చెప్పారు.
లోకేశ్ రెడ్‌బుక్ ప్రకారమే ఇదంతా జరుగుతున్నదని విమర్శించారు. దాడులపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలుపుతామని, అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఏపీలో పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారని జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అండగా నిలవాల్సిన పోలీసులే బాధితులపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఏపీలో పాలన ఆటవిక రాజ్యాన్ని తలపిస్తున్నదని, 45 రోజుల పాలనలోనే 36 హత్యలు, 300కు పైగా హత్యాయత్నాలు జరిగాయని, 560 ప్రాంతాల్లో ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమయ్యాయని, వైసీపీ సానుభూతిపరుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని, 490 ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని, వెయ్యికిపైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయని ఆవేదన వ్యక్తంచేశారు.
ఈనెల 24న రాజ్యసభ, లోక్‌సభ, శాసనసభ, శాసనమండలి సభ్యులతో కలిసి ఢిల్లీలో శాంతియుతంగా ధర్నా చేస్తామని వెల్లడించారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తామని చెప్పారు. వచ్చే బుధవారం ఢిల్లీలో జగన్ నేతృత్వంలో ధర్నా జరుగుతుందని, ఇందులో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాలొంటారని వైఎస్సార్సీపీ ప్రకటించింది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన హత్యలు, లైంగికదాడులు, దాడులపై నారా లోకేశ్ శ్వేతపత్రం ఇవ్వాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి శుక్రవారం ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.