అమరావతి : నిరుద్యోగులకు శిక్షణ పేరిట వేధింపులకు గురిచేసిన ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్ నిర్వాహకుడు , మాజీ ఆర్మీ అధికారి (Former army official ) బసవ రమణను పోలీసులు అరెస్టు (Arrest) చేశారు. భారత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ శ్రీకాకుళంతో (Srikakulam) పాటు పరిసర జిల్లా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ఒక్కొకరి దగ్గర నుంచి రూ.5-10 లక్షల వరకూ వసూళ్లు చేశాడు.
శిక్షణ పేరుతో సెంటర్‌కి వచ్చిన అమ్మాయిల గదుల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డు చేశాడు. వాటిని అడ్డుపెట్టుకుని స్నేహితులతో కలిసి అమ్మాయిలను వేధింపులకు గురి చేశాడు. ఈ విషయం తెలుసుకున్న నలుగురు యువకులు అమ్మాయిల ఇంట్లో విషయాన్ని చెప్పినందుకు వారిని బంధించి చిత్రహింసలకు గురిచేశాడు. వారిని విద్యుత్ తీగలతో విఫరీతంగా చితకబాదిన వీడియో వైరల్ కావడంతో బసవ రమణ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకొచ్చాయి.
ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శ్రీకాకుళం పోలీసులకు విచారణకు ఆదేశించారు. వెంటనే అరెస్టు చేసి కేసు నమోదు చేయాలని సూచించడంతో ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్‌పై పోలీసులు శనివారం దాడులు చేసి నిర్వాహకుడు బసవ రమణను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేరు చెప్పుకుని బసవ రమణ అనేక దందాలు, అక్రమాలకు పాల్పడినట్లు వైసీపీ ఆరోపించింది. కేంద్రమంత్రి పేరు వాడుకుని షాపింగ్ మాల్స్ బార్లకు వెళ్లి బిల్లులు చెల్లించకుండా బెదిరింపులకు తెగబడ్డాడని , అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.