ఎవరైనా పర్సో.. బ్యాగో పోగొట్టుకుంటే పోలీసులు వెదికి పట్టుకుంటారు. మనం కూడా చాలా కాస్ట్లీ వస్తువులు పోతేనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి వారి సాయం కోరుతాం. అయితే, ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఏపీ పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఆయన ఫిర్యాదు చేసింది బంగారు నగలో.. లక్షల నగదున్న బ్యాగో కాదు.. పొలం దగ్గర పెట్టిన ఓ ఫ్లెక్సీ మాయమైందంట. ఇంతకీ ఆ ఫ్లెక్సీ ఎవరిది.. ఆ ఫ్లెక్సీలో ఏమున్నది..
వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ.. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయంపై మక్కువతో ధర్మవరం, రాచపల్లి గ్రామాల్లో 12 ఎకరాలు కౌలుకు తీసుకుని సేంధ్రీయ పంటలు పండిస్తున్నాడు. తన వ్యవసాయ క్షేత్రం వద్ద స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ.. ఆర్గానిక్ వ్యవసాయ క్షేత్రం అని ఒక ఫ్లెక్సీని ఆగస్టు 15 వ తేదీన ఏర్పాటు చేశాడు. అయితే, ఈ నెల 1 నుంచి సదరు ఫ్లెక్సీ కనిపించకుండా పోయిందని లక్ష్మీనారాయణ వ్యవసాయ క్షేత్రంలో కాపాలాగా ఉన్న దొరబాబు అనే వ్యక్తి ప్రత్తిపాడు పోలీసులను ఆశ్రయించాడు.
ఫిర్యాదును అందుకున్న ప్రత్తిపాడు పోలీసులు ఆఘమేఘాల మీద దర్యాప్తు ప్రారంభించారు. సీసీ టీవీ కెమెరాలను జల్లెడ పట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తొలగించారా? లేదా ఆకతాయిలు చేసిన పనా? అనేది తేల్చడంలో పోలీసులు బిజీ అయిపోయారు. వీలైనంత త్వరగా ఫ్లెక్సీని వెతికిపట్టుకుంటామని ప్రత్తిపాడు పోలీసులు మాజీ పోలీస్ బాస్‌కు హామీ ఇచ్చారంట. దీనిపై కాకినాడ జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. పెద్ద దొంగతనాలు జరిగితేనే దిక్కులేదు.. ఫ్లెక్సీ మిస్ అయిందని ఫిర్యాదు చేయడమా? అంటూ రాగాలు తీస్తున్నారు.