(Hens in Jail) ఏలూరు: సంక్రాంతి పండగ హడావుడి అప్పుడే మొదలైంది. ఇప్పటికే పిండివంటలు తయారవుతుండగా.. మరోవైపు దూర ప్రాంతాల్లో ఉన్నవారు సొంతూళ్లకు వచ్చేందుకు ప్రయాణ టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారు. సందట్లో సడేమియా అన్నట్లు పందెంరాయుళ్లు కూడా సిద్ధమవుతున్నారు. సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు పందెం కోళ్ల పోటీలు జరుపుతుండగా.. లక్షల్లో చేతులు మారుతుంటాయి. కాయ్ రాజా కాయ్ అంటూ అప్పుడే కోడి పందేలను నిర్వహిస్తున్నారు. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలోని పాములపర్రు, కలుగొట్ల గ్రామాల్లో కోడి పందేలు జరుగుతున్నాయన్న ముందస్తు సమాచారం మేరకు పోలీసులు దాడులు జరిపారు. పలువురు పందెం రాయుళ్లను అరెస్ట్ చేసి 9 కోళ్లను స్వాధీనపర్చుకున్నారు.
అయితే, స్వాధీన పర్చుకుని ఉండి పోలీస్ స్టేషన్లో సెల్లో ఉంచిన పోలీసులు.. వాటిని మేపలేక అవస్థలు పడుతున్నారు. స్వాధీనం చేసుకుని 11 రోజులు కావస్తున్నా.. వాటిని విడిపించుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దాంతో ఆ 9 పందెం కోళ్లు 11 రోజులుగా పోలీస్ స్టేషన్లోనే ఉంటున్నాయి. మామూలుగా అయితే పందెం కోళ్ల ఓనర్లు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫైన్ కట్టి వాటిని తీసుకెళ్తారు. అయితే ఈ పందెం కోళ్లను తీసుకెళ్లడానికి ఎవరూ రావడం లేదు. దాంతో వాటి పోషణ పోలీసులే చూస్తున్నారు. కోళ్లను పెంచలేక, వాటిని పెంచి పందేలు ఆడిపిస్తున్నవారిని పట్టుకోలేక ఉండి పోలీసులు నానా అగచాట్లు పడుతున్నారు. కోడిని బయటకు పంపలేక.. కోడి పెంట నిత్యం తీయలేక చచ్చిపోతున్నామని వాపోతున్నారు ఉండి పోలీసులు.