Farmer Suicide | కుబీర్ : అప్పుల భారంతో ఓ రైతు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తీగలు పట్టుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో చోటు చేసుకున్నది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సిర్పెల్లి (H) గ్రామానికి చెందిన జాదవ్ మారుతి(45) తనకున్న ఐదెకరాల వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటూ దీంతో పాటు ఆటోను కూడా నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, గత రెండేళ్ల రెండేళ్ల కూతురి పెళ్లికి చేసిన అప్పులు తీర్చేందుకు ఎకరన్నర భూమిని అమ్మేశాడు. అయినా అప్పులు తీరకపోవడంతో మళ్లీ భూమి అమ్మితే ఉన్న ఒక్క కొడుకుకు భూమి ఉండదని.. అప్పులు తీర్చే మార్గం లేకపోయింది.
ఈ విషయం నిత్యం కుటుంబీకులతో చర్చిస్తూ మదనపడుతూ వస్తుండేవాడు. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన మారుతి సోమవారం మధ్యాహ్నం పల్సి తండాకు వెళ్తున్నానని ఇంట్లో భార్యకు చెప్పి ఆటో తీసుకుని వెళ్లిపోయాడు. తండా సమీపంలో రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ టాన్స్ఫార్మర్కు గల తీగెలకు పట్టుకుని శవమై కనిపించాడు. ఆ ప్రాంతంలో పంట పొలాల్లో పని చేస్తున్న రైతులు శవం వేలాడుతుండాన్ని గమనించి మారుతీ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి శవాన్ని భైంసా ఏరియా దవాఖానకు తరలించారు. భార్య జాదవ్ లక్ష్మి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.